ॐ 






ఆత్మ నిష్ఠ

కాంక్ష, మోహం లోనుంచి బయిటపడాలి అనంటే,
మూడు నియమాలను పెట్టుకోవాలి కదా!
ఏమిటి? అవి.
(1). ‘ధర్మం తప్పి ప్రవర్తించను’-అనేది వుండాలా? వద్దా?
అదేమిటి?
స్వధర్మం, పరధర్మం.
So, ధర్మం తప్పి ప్రవర్తించడం అంటే?
స్వధర్మాన్ని తప్పి ప్రవర్తించను. ఆత్మధర్మాన్ని తప్పి ప్రవర్తించను.
ఆత్మధర్మాన్ని తప్పి ప్రవర్తించినదంతా అధర్మమే. పర ధర్మమే. అర్థమైందా?
ఇంకొకటి ఏమిటి?

(2). ఇకచాలు.
ఇక చాలా? ఉన్నది చాలా?
శి: ఉన్నది చాలు.
గు: ఉన్నది చాలుఅంటే... ఇంకా అందులో శేషం మిగిలి వుందిగా...
శి: ఇక చాలు’ - అనగలగాలి.
గు: ఉన్నది చాలు’ - అన్నవాడికి...
అప్పుడేమయ్యింది? శేషం మిగలడం లేదా?

ఆత్మ ధర్మంలో, ‘ఉన్నదిచాలుఅనడానికి అక్కడ ఏముంది?
అంతటా వున్నదే కానీ అది, పరిమితంగా లేదుగా. కాబట్టి ప్రపంచానికి సంబంధించినటువంటి పరధర్మ విషయం వచ్చింది.
అక్కడేమి చెప్పాడు ఇక?
ఇక చాలు’ - అన్నాడు.
ఉన్నది చాలు’ - అనడం లేదు ఇప్పడు.
ఇక చాలు’ - అన్నాడు.
ఇక చాలు’ - అని ఎప్పుడైతే అన్నాడో ఏమైంది? ముగిసిపోలేదా ఇక...?
Full stop పడిపోయింది.
ఉన్నది చాలు’ - అంటే ప్రపంచం మిగిలింది ఇంకా.
విషయం కూడా మిగిలింది ఇంకా.
ఆసక్తి కూడా మిగిలింది ఇంకా అక్కడ.
ఇకచాలయ్యా! ఈ ఆట చాలా కాలం ఆడాను, ఇంకెంత కాలం ఆడతాను?
నేను ఎప్పటి నుంచో ఆడుతూనే వున్నాను. ఎన్నో లక్షల జన్మల్లో ఆడుతూనే వున్నాను.
ఈ జననమరణాలనే ఆట ఆడుతూనే వున్నాను.
ఇకచాలు. ఈ జన్మతో ఇక చాలు. అర్థమైందా?!
ధర్మం తప్పను’, ‘ఇక చాలు’.

(3). మూడవ నియమం.... అవసరం లేదు’. ఇది చాలా బలమైనటువంటి నియమం.
జననమరణాలు కలగడానికి కారణం ఏమిటి?
అవసరమేగా! అవసరం వుందిఅనే భావన వుందనుకోండి, మళ్ళా రాక తప్పదు.
కాబట్టి అవసరం లేదుఅనే నియమాన్ని పాటిస్తే ఏమైంది?
ఇక నేను దానికి లొంగటం లేదు కదా! ఇక, అర్థమైందా?
తీవ్ర వైరాగ్య సంపన్నుడు - జగమొండి.
రాజుకంటే బలవంతుడు.
వాడిని ఏదీ వంచలేదన్నమాట ఇక.
ఎందుకనీ?
వాడి దగ్గర ఈ మూడు నియమాలు వుంటాయి.

1. ధర్మం (స్వధర్మం) తప్పడు.
2. ‘ఇకచాలుఅంటాడు ఏదైనా సరే.
3. ‘అవసరం లేదుఅంటాడు... నువ్వు ఏదైనా చెప్పు,

పిపీలికాది బ్రహ్మపర్యంతము’ - అంటున్నామా? లేదా? వివేకచూడామణిలో... అంటున్నామా? ఏమి ఇవ్వబడుతాయి?
అంటే, పిపీలకము నుంచీ బ్రహ్మపదవి వరకూ...
కాబట్టి పిపిలికాది బ్రహ్మపర్యంతమూ నీకు గనుక ఇవ్వబడినప్పటికీ... నువ్వు ఏమన్నావు?
అవసరం లేదు’. నాకెందుకు?
పిపీలికాది బ్రహ్మపర్యంతము నీకు ఎక్కడో ఒకచోట అవసరం వుంది అనే భావన వుందనుకోండి, మళ్ళా పుట్టాల్సిందే. మళ్ళా శరీరం ధరించవలసిందే.

కాబట్టి, తీవ్రవైరాగ్య సంపన్నుడు, తీవ్రమోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు, ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు... ఈ మూడు నియమాలను కలిగి వుంటాడు.

ఏమిటి?

స్వధర్మే నిధనం శ్రేయః” - కేవలం స్వధర్మాన్నే పాటిస్తాడు.
మిగిలిన ఏ పాత్రోచిత ధర్మాలను నేను పాటించను. నాకు అవసరం లేదు.
ఎందుకని?

ఇకచాలయ్యా! చాలాకాలం ఆడాను... పాత్రోచిత ధర్మాలు. ఆట ఎంతోకాలం ఆడాను, ఎన్నో లక్షల జన్మల్లో ఆడాను. నాకంటవు ఇక. నేను ఎదిగాను. పాత్రచేత నేను ప్రభావితం కావడం లేదు. నాకు పాత్రోచిత ధర్మాలు లేవు.

కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? తను అందరికీ బంధువేగా? యుద్ధంలో ఏం చేశాడు?
వరుసబెట్టి వేసేశాడు.
మరి ఇప్పుడు బంధువేగా? ఎలా వేశాడు?

నాకు పాత్రోచిత ధర్మాలేమిటి? నేను పరమాత్మను.
కాల ధర్మాన్ని పోషించడమే నా ధర్మం. నా స్వధర్మంఅది.

కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమి హ ప్రవృత్తః
ఋతేపిత్వా నభవిష్యంతి సర్వే (అంటున్నాడా? లేదా?)
ఏవస్థితాః ప్రత్యనీకేషుయోధా” (గీత 11-32)

ఏమని చెబుతున్నాడు?
కాలంలో సమస్తలోకాలు పుడుతున్నాయి. పోషించబడుతున్నాయి. లయించ బడుతున్నాయి. పరమాత్మ కాలాతీతుడు. నేను బావా, నేను మరదలు, నేను మరిది, నేను అన్నయ్యా, నేను తమ్ముడు, నేను భర్త, నేను భార్యా... అవేవీ నాకు లేవు.

అర్జునుడు: బావా! ద్వారక మునిగిపోతుంది.
శ్రీకృష్ణుడు: సమయం అయిపోయింది.

ఒక్కటే మాట చెప్పాడు, సమయం అయిపోయింది అన్నాడు.
అర్జునుడు అన్నాడు: ద్వారక మునిగిపోతుంది’.
‘Time అయిపోయిందయ్యా’!  అర్థమైందా?
అంతేగాని పరమాత్మ ఎక్కడా వలవలా ఎడవలా.
ఏ సంఘటనలోనూ కన్నీళ్ళు పెట్టలేదు. కారణం?
ఇకచాలు’. ఆట చాలాసార్లు ఆడాను.
ఇప్పుడు పరమాత్మగా ఆడుతా.
కాలాతీతంగా ఆడుతా.
దేశకాలములకు అతీతంగా ఆడుతా.
ఆత్మనిష్ఠుడనై ఆడుతా.
బ్రహ్మనిష్ఠుడనై ఆడుతా.
పరబ్రహ్మ నిర్ణయంతో ఆడుతా…!! అప్పుడేమయ్యింది?
పిల్లలాటల పోలికాయెను”.
ఆటలో ఆసక్తి వుంది.
పెద్దవాళ్ళు పిల్లల ఆటను ఎలా చూస్తున్నారు?
అలా చూస్తా! సృష్టి స్థితి లయాలను.
అప్పుడేమయ్యావు?
నాకు జనన మరణాలెక్కడా?
నాకు జనన మరణాలు లేవు.
జనన మరణాలే లేనన్నవాడికి ఏమిస్తావు?
నువ్వు ఏమిచ్చి సంతృప్తి పరచగలుగుతావు?
నాకు అసంతృప్తే లేదు.
అవసరమే లేదు.
కోరిక అసలే లేదు.
కాంక్ష, మోహములంటావా?
(అవి) కాంక్ష, మోహములు నా చేతిలో కీలుబొమ్మలు.

విష్ణుమాయా ప్రభావం చేత ఎవరైనా ప్రభావితం కావచ్చునేమో కానీ... విష్ణువు ఎందుకు మోహింపబడుతాడు?
వైష్ణవమాయ చేత, జగములెల్ల మోహించబడుతున్నాయి. అంతేగానీ... పరబ్రహ్మ స్వరూపమైనటువంటి విష్ణుమూర్తి ఎందుకు... మహావిష్ణువు ఎందుకు మాయచేత బాధించబడుతాడు?
బాధించబడటం లేదు కదా!
అట్లా మాయను మీరినటువంటి స్థితిని సాధించేటటువంటి స్థితిలో....

నేను ఖాళీగా వున్నానుఅంటావు ఏంటి అసలు?
నేను చాలా busy గా వున్నాను’.
ఎంతబిజీగా వున్నాను?
లక్షలాది జన్మలనుంచీ పోగేసిందంతా వదిల్చేపనిలో వున్నా.
నువ్వేమో ఈ కాసేపు కొద్దిగా, లేనిది సంపాదించుకునే పనిలో నువ్వు వుంటే వుండవచ్చేమో!
నేను ఏం పనిలో వున్నాను?
లక్షలాది జన్మలనుంచీ పోగేసానే, ఆ పోగేసినవన్నీ వదుల్చుకునే పనిలో వున్నా నేను.
ఇప్పుడు ఎవరు busy గా వున్నారు?
నేను చాలా busy గా వున్నాను.
నేను చాలా విశాల భావంతో పనులు చేయవల్సిన కాలం ఇది.
పరిమితమైనటువంటి పద్ధతిగా... నా భార్యా, నా కొడుకు, నా కోడలు, నా ఇల్లు, నా మనవడు, నా గోడ, నా సున్నం... అనే కాలం కాదు నాది.
గృహస్థాశ్రమ ధర్మం అయిపోయింది.
ఎప్పటితో ముగిసింది?
పిల్లలకు పెళ్ళి చేశావు. Finished. Your job is finished.
ధర్మం చెప్పింది.

నీ ఆఖరి ధర్మంఏమిటయ్యా?
దైవానికి ప్రతినిధిగా నువ్వు చేసే ఆఖరి పని ఏమిటి ?

పిల్లాడికి పెళ్ళిచేయటం. ప్రాజాపత్య ధర్మంలో వాడిని ప్రవేశపెడితే నీ పని అయిపోయింది. ఇహ తరువాత నిన్నెప్పుడూ పీటల మీద కూర్చోమని అడగరు.
అడుగుతున్నారా? చూసుకోండి!

జననం నుంచి అంత్యేష్టి లోపల... నిన్ను మళ్ళా పీటల మీద కూర్చోమని అడగరు ఇక. పిల్లాడికి పెళ్ళి చేసినప్పుడు కూర్చోటమే... ఆఖరి కూర్చోవడం. కర్తృత్వం అయిపోయింది అక్కడితో. కానీ మనం ఏం చేస్తున్నాం?

మనవళ్ళు పుట్టారు, ముని మనవళ్ళు పుట్టారు, వాళ్ళు ఆస్తులు సంపాదించారు. వాళ్ళు సంసారాలు చేశారు. వాళ్ళ పెళ్ళిళ్ళు... ప్రతిచోట నేను పెద్దమనిషిని అంటావే! అంటే ఎక్కడో ఏమైంది దోషం?

ధర్మాన్ని అతిక్రమించి, స్వధర్మాన్ని అతిక్రమించి.... పరధర్మంలోకి ప్రవేశించి కాంక్ష, మోహానికి, ఆసక్తికి బలాన్నిచ్చి... జీవభావంతోనే నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను. ఎందుకని?
Easy కదా! ఈ పని చేయడం.

కాబట్టి ఎదిగేకొద్దీ నేను ఏమయ్యాను ఇప్పుడు?

కాంక్షలు లేవు,
మోహం లేదు,
కోర్కె లేదు,
అవసరం లేదు,
అసంతృప్తి లేదు,
స్వధర్మమే నియమం!!
ఇకచాలు’ - దేనికైనా ఒకటే answer. “ఇకచాలయ్యా”!
ఓహో! నేను చాలా చూశాను ఇప్పటికి,
Long long ago, so long ago, చాలా కాలం నుంచీ చూస్తున్నాను నేను. ఈ జన్మలోనేనా... ఎన్నో జన్మలనుంచీ చూస్తున్నా!

చూసి, చూసి, చూసి, చూసి తీవ్ర వైరాగ్యంకలిగింది నాకు. అట్టి తీవ్ర వైరాగ్యం చేత, నేనేం చెబుతున్నాను ఇక... ఇక చాలండీ’. ఇంకా.. ఇంకా... అయినా వదిలిపెట్టాననే అన్నా. మళ్ళా ప్రశ్నలేదు.
ఏమన్నావు?
అవసరం లేదు.
ఇంకా మళ్ళా వాడు మన జోలికి వస్తాడా?
ఇహ వాడు రాడు.
అయితే జ్ఞానపరమైనటువంటి ఋణాన్ని మాత్రం తీరుస్తా. ఎందుకని?

ఆత్మనిష్ఠుడైనటువంటి వాడికి ఆ ఒక్క ఋణమే వుంది. ఇంకా మిగిలినవి లేవు. అర్థమైందా?

దైవఋణం, శాస్త్ర ఋణం, ఋషి రుణం, పితృ ఋణం... అంటున్నామా లేదా?

వీటిల్లో ఎప్పడు చూసినా పితృఋణం తీర్చుకోవడంతోనే జీవితం సరిపోతుంది.
ఇంకా శాస్త్ర రుణం, దైవ రుణం, ఋషి రుణం... ఎప్పుడు తీరస్తావు?

దైవీ ప్రణాళికలో భాగం అవ్వాల్సిన అవసరం లేదా?
దైవం చేతిలో పనిముట్టగా జీవించవలసిన అవసరం లేదా?
దైవంతో లయత్వాన్ని, ఆ ఏకత్వ భావాన్ని పొందినటువంటి, స్థిరత్వాన్ని పొందినటువంటి స్థితిని అనుభవించవలసిన అవసరం లేదా?
అప్పుడు కదా దైవ ఋణం తీరేది!

దివ్యజ్ఞానాన్ని పొందినప్పుడు కదా
ఆ దివ్యత్వాన్ని నువ్వు అనుభవించినప్పుడు కదా
జీవేశ్వరులు అభిన్నులనేటటువంటి దివ్యత్వాన్ని నువ్వు అనుభవించినప్పుడే, దైవఋణం తీరుతుంది.

తీర్థాటనలు చేస్తే దైవఋణం తీరదు.
పూజలు, జపాలు చేస్తే... దైవ ఋణం తీరదు.
కానీ దానికొక ప్రాతిపదికను తయారు చేశారు.
అది చిత్తశుద్ధికి ఒక ప్రాతిపదికగా పనికి వస్తుంది.
చేయొద్దని కాదు. అందుకనే ఏం చెప్పారు?

ఉత్తమం తత్వచింతాచ,
మధ్యమం మంత్ర చింతాచ,
అథమం శాస్త్ర చింతాచ,
అథమాథమంచ తీర్థాటనం!

పై మూడింటికీ పనికిరాలేదు, అప్పుడేం చేయాలన్నమాట?
తీర్థాటన చెయ్యాలి.
నీ బుద్ధి వికాసం, చైతన్య వికాసం, ప్రజ్ఞా వికాసం... ఉత్తమంగా వుంది - తత్త్వచింతన చేస్తే చాలు.
ఉపనిషత్తులు చదివితే ఆనందం అనిపిస్తుంది, బ్రహ్మసూత్రాలు చదివితే ఆనందం అనిపిస్తుంది, సద్గోష్ఠి వల్ల ఆనందాన్ని పొందుతావు.
అంతేగానీ... రామేశ్వరం వెళ్ళి శివాలయంలో పూజారిగారు అర్చన చేస్తూ వుంటే, ఆ అలంకారాన్ని చూసి ఆనందపడవు. ఎందుకని?

ఆయన స్థాణువు. అచలం.
నేను?
నేనూ అదే!
నేనేమీ కదిలేవాడిని కాదు. నీకు నాకూ భేదం లేదయ్యా’ - అనేటటువంటి పద్ధతిగా చూసేటటువంటి శక్తి తత్త్వచింతనవల్ల కలుగుతుంది.

మరి అటువంటి అభేద స్థితిని కదా
మానవుడు సాధించ వలసిన ఉత్తమమైనటువంటి స్థితి?

కాబట్టి అటువంటి ఉత్తమమైన చైతన్యాన్ని, ఉత్తమమైన ప్రజ్ఞా వికాసాన్ని కదా... నీవు ఎప్పుడూ కలిగి వుండాల్సింది ఆచరణలో...!

దిగింది కొంచెం అప్పడు ఏమయ్యావు? అప్పుడేమయ్యావు?
మంత్రచింతాచ...
ఓం నమో నారాయణాయ
అష్టాక్షరీ మంత్రం, పంచాక్షరీ మంత్రం, షోడశాక్షరీ మంత్రం, హంసమంత్రం... ఆ మంత్రం.. ఈ మంత్రం.. మీ ఉపదేశమంత్రాలు ఇవి అన్నీ... జపం చేస్తూ వుండడం. ఎందుకని?
ద్వైతం వచ్చేసింది. అద్వైత భావన పోయింది. అప్పుడేమయ్యావు?
అచలం పోయి ఎఱుకలోకి వచ్చేశావు.
వచ్చేస్తే?
ఇక అప్పుడు అన్నీ వచ్చేశాయి. సప్తకోటి మహామంత్రాలు వచ్చేశాయి.
చిత్తవిభ్రమ కారకః.
ఆ ఎఱుక ప్రభావం చేత చిత్త విభ్రమ కలిగింది. అర్థమైందా?
మరి అప్పుడేమి చెయ్యాలి?
ఇంకా పడిపోయావు. అక్కడే ఎందుకు ఆగుతావు?
త్రిశంకు స్వర్గం కదా అది. అక్కడ ఆగవు కదా!
అథమం శాస్త్ర చింతాచ.
భగవద్గీతలో అలా చెప్పారండీ...
వివేక చూడామణిలో ఇలా చెప్పారండీ...
అష్టావక్రగీతలో అలా చెప్పారండీ...
ఋభుగీతలో ఇలా చెప్పారండీ...
నారాయణోపనిషత్తులో ఇలా చెప్పారండీ...
ఈశావాస్యోపనిషత్తులో అలా చెప్పారండీ...
ఈ తగాదా మధ్యలో పడి కొట్టుకుపోతుంటాడు.
ఇప్పడు పండితుందరూ ఏ తగాదాలో వుంటారండీ?
ఎప్పుడూ ఈ తగాదాలో వుంటారు.
ప్రవచనం చెప్పేవాళ్ళుకానీ, పండితులు కానీ... వాళ్ళు ఆచరణ శీలంగా వుండరండీ... తత్త్వచింతనలో వుండడు వాడు, వాడు ఎంతసేపు శాస్త్ర చింతనలో వుంటాడు. అర్థమైందా? సరే, ఏదీ చేయకపోవడం కంటే అది ఉత్తమమే. తమోగుణంలో జీవించడం కంటే, అది బెటరే. కానీ... జీవితం గట్టెక్కుతుందా దాని వల్ల? ఎక్కదు కదా!
అథమాథమం చ తీర్థాటనం

అక్కడ ఆగావా ఏమన్నా పోనీ... శాస్త్ర చింతన దగ్గర?

శ్రీశైలం వెళ్తే బాగుండూ...
కేదార్‌నాథ్‌ వెళ్తే బాగుండూ...
అమర్‌నాథ్‌ వెళ్తే బాగుండూ...
రామేశ్వరం వెళ్తే బాగుండూ...
అరుణాచలం వెళ్తే బాగుండూ...
ఏమిటి బాగుండు? ఎవరు బాగుండు? అంతేనా కాదా?

అయితే... ఈ నాలుగూ అవసరమే!
శి: ప్రాధాన్యతను బట్టి...
గు: ఆఁ...

నీవు తమోగుణ స్థాయిలో వున్నావండీ... అప్పుడేమి చెయ్యాలి?
తీర్థాటన చెయ్యాలి.

కొద్దిగా రజోగుణ స్థాయిలో వున్నావండీ...
అప్పుడు శాస్త్ర చింతన చెయ్యాలి.
సత్వగుణ స్థాయిలో వున్నావండీ...
అప్పుడు మంత్ర.. (ఆంతరిక) మానసిక జపం చెయ్యాలి.
గుణాతీతంగా వున్నావండీ... తత్త్వచింతన చెయ్యాలి. అర్థమైందా?
కాబట్టి,
ఎవరైతే నిరంతరాయంగా... గుణాతీతంగా తత్త్వచింతనలో వుండి నిమగ్నమైపోయున్నారండీ... ఇప్పుడు వాడికి మిగిలిన మూడూ తోచాయా?
తోచడం లేదుగా... ఎందుకని?

నేను బ్రహ్మనిష్ఠుడను.
బ్రహ్మస్వరూపుడను.
నేను ఆత్మస్వరూపుడను.
నేను పరబ్రహ్మస్వరూపుడను.
నేను ఈశ్వరుడను.

వాడికి ఎప్పుడూ అక్కడ పనిచేస్తూ వుంటుంది. దిగదు కిందకు అది. అర్థమైందా?
అప్పుడు కిందకి దిగని వాడికి ఏం చెబుతాం వాడిని... దిగితే కదా...!
గుణత్రయంలోకి దిగితేగా.
త్రిపుటిలోకి దిగివస్తే తప్ప... వాడిని ఏం చెయ్యలేవుగా...! అర్థమైందా?

కాబట్టి, ఇట్లా నిజజీవితంలో ఎవరైతే... సదా తత్వచింతనలో వున్నారో,
వాడికి ఇప్పుడు కాంక్ష వుందా?
మోహం వుందా?
శి: లేదు..
గు: ఎందుకని?
ఇది చాలలేదుఅనడానికి వాడు దిగిరావడం లేదుగా అసలు...!

పైనున్న కైలాస శిఖరం పై నుంచీ... కిందకి దిగితే కదా...
దిగడం లేదుగా అసలు వాడు. సదా సదాశివుడే.
సదా... సదాశివుడే!
సదా... సమాధి నిష్ఠుడే!
సదా... ఆత్మ నిష్ఠుడే!
సదా... బ్రహ్మనిష్ఠుడే!
సదా... ముక్తుడే!
వాడికి తోచడం లేదు కదా... ప్రపంచం.
తోస్తేకదా... వాడిని ఏమన్నా అడగడానికి.

ప్రపంచం తోస్తే... అప్పుడు అసంతృప్తి.
అసంతృప్తి నుంచీ అవసరం...
అవసరం నుంచీ కోరిక...
కోరిక నుంచీ కాంక్ష...
కాంక్ష నుంచీ మోహం...

అసలు ప్రపంచమే తోచకపోతే?
వున్నాయా ఈ ఐదు?
శి: లేవు.
గు: లేవుగా...!

కాబట్టి, ఆత్మనిష్ఠుడు అయినవాడు ఏ నియమాన్ని పాటించాలి ఇప్పుడు?
స్వధర్మాన్ని పాటించాలి!!
ప్రపంచం గురించి ప్రశ్న వేస్తే చాలు.
ఇక చాలయ్యా బాబు. ఆట చాలా కాలం ఆడాను.
మరింక నీ సంగతి ఏంటి?
వచ్చేసారికి నీ సంగతి ఏంటి? అని మరణకాలంలో ప్రశ్నిస్తాడు.
ఆ నాకేమి అవసరం లేదు”.

ఇవాళ అందరికీ ప్రశ్న ఇదేనండీ.... “సాధకుడు”లో... నిన్న పాఠం ఇక్కడ... యోగ పాఠం, యోగ సెంటర్‌... వాళ్ళకు ఇదే పాఠం. అది యోగిరాజ్‌ వేదాద్రి మహర్షి వారిది. SKY అన్నమాట.
యోగిరాజ్‌ వేదాద్రి మహర్షిగారని... వారి సాంప్రదాయంలో... SKY... Simplified Kundalani Yoga, దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ధ్యానం చేస్తూ వుంటారు. ఒక పదిమంది.
నిన్న వాళ్ళని ఈ ప్రశ్నలు వేశా...
అసంతృప్తి అంటే ఏమిటి?
అవసరం అంటే ఏమిటి?
కోరిక అంటే ఏమిటి?
కాంక్ష అంటే ఏమిటి?
మోహం అంటే ఏమిటి?
ఎట్లా బయటపడాలి?
స్వధర్మం అంటే ఏమిటి?
పరధర్మం అంటే ఏమిటి?

చదువుతాం... శాస్త్రంలో!
కానీ నిజ జీవితంలో.... Apply చేసుకోవాలి.
నిజ జీవితంలో.... Apply చేసుకోకపోతే ఏమౌతాం?
ఎప్పుడూ శాస్త్ర చింతనే...!
చదివేవాడు... చదువుతూనే వుంటాడు అంతే!
నిజ జీవితంలోకి ఎదిగి రాడన్నమాట!
జీవితంలో పాటిస్తేనే కదా... ఆ ఎదుగుదల వచ్చేది, లేకపోతే వస్తుందా?
రాదు కదా!
అవ్వటం లేదుగా ఆ పని...
మళ్ళా మళ్ళా మిగిలిపోతూనే వుందిగా!

పునరావృత్తి రహితం” అవ్వాలా? వద్దా?
కానీ... అవ్వటం లేదుగా.

పునారావృత్తి రహిత కైలాస లోకే నిత్య నివాస సిద్ధిరస్తు
అని ఆశీర్వదిస్తారు.
ఆశీర్వదిస్తున్నామా?
అంతపెద్ద ఆశీర్వచనం, మనకి ఇవాళ ఎవరికన్నా తెలుసా?
ఏం తేలీదు.

శాశ్వతంగా కైలాసంలో... నిత్యనివాసం కలిగివున్నటువంటి, సదాశివుని వలె నిత్యముక్తునివై వుండవమ్మా!

చూడండి! ఎంత గొప్ప ఆశీర్వచనమో!
పునరావృత్తి రహితం’ - జనన మరణాల్లోకి రాడు ఇక!

ఇంకా అంతకు మించి ఏ ఆశీర్వచనం కావాలి మానవుడికి, ఈశ్వరుడి నుంచి?

కాబట్టి.... ఈశ్వరానుగ్రహంఅంటే ఇదే...!
ఈ ఈశ్వరానుగ్రహం ఒక్కటే ఆశీర్వచనం...
మిగిలనవన్నీ ఈశ్వరానుగ్రహాలు కావు. అర్థమైందా?

మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది...
మా అల్లుడికి ఆరోగ్యం వచ్చింది...
నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి.... ఇవేవీ ఈశ్వరానుగ్రహాలు కావు.

కాకపోతే ఏమిటి?
పిల్లలాట!
పిల్లలాట ఆడుకునేటప్పుడు...
ఈ బొమ్మ మా నాయన కొనిపెట్టాడు, మా అమ్మ కొనిపెట్టింది... అని ఆనందపడిపోవడం లేదా? అట్లా...!
ఇది నా బొమ్మఅంటాడు. అంటాడా? లేదా?
మనం కూడా అంతే!

భ్రమాజన్యజ్ఞానంఅన్నమాట.
భ్రాంతికి, భ్రమకి లోనవ్వగా... లోనవ్వగా... లోనవ్వగా... లోనవ్వగా... అదే సత్యమని తోచింది.
దానికంటే భిన్నమైన వ్యతిరేకమైనటువంటిది...
యథార్థ సత్యమేదైతే వుందో... ఆ సత్యం తోచడం మానేసింది.

చీకటిలోనే వుండడం అలవాటు పడిపోయి... ప్రకాశం... సూర్యుడు వస్తే చూడలేడు.

గబ్బిలం వుందండీ! అది జీవితం అంతా ఎప్పుడూ ఎలా వుంటుంది?
ఎప్పుడూ చీకటే... ఏం చేస్తుంది? సూర్యోదయం అవ్వగానే...
శి: గూడుల్లో... చీకటిలోకి వెళ్ళి దాక్కొంటుంది.
గు: చీకట్లోకెళ్ళి దాక్కుంటుంది.
ఎందకని అంటే... సూర్యుడిని చూడటంలేదు అది.
మనం కూడా అంతే!

ఎంతకాలం అయితే ఇట్లా?
ఈ జీవభావంతో...
ఇదే గృహస్థ ఆశ్రమంతో...
ఇదే భ్రమాజన్యజ్ఞానంతో...
అజ్ఞానంతో...
ఆ కాంక్షతో...
మోహంతో... జీవిస్తూ వున్నంతకాలం...
ఆ “స్వస్వరూపజ్ఞాన సూర్యుడి”ని చూడలేము. స్వధర్మాన్ని ఆశ్రయించ లేము.

ఆ స్వస్వరూప జ్ఞాన సూర్యుడిని చూస్తే.... ఒక్కసారి చీకటి పటాపంచలైపోతుంది.

నీలోపల వున్న స్వప్రకాశ దర్శనం కలిగిందమ్మా...” అయిపోయే... ఇంకేముంది?
ఆ ప్రకాశమే లేకుంటే...
నీలోపల ప్రపంచమూ లేదు, నీ బయట ప్రపంచమూ లేదు.
కాబట్టి నేను ప్రకాశాన్ని.
అంతేకానీ
నేను సినిమాని కాను.
నేను విషయాలు కాదు.
నేను ఇంద్రియాలు కాదు.
నేను శరీరం కాదు.
నేను భావాలు కాదు.
నేను ఆలోచనలు కాదు.
నేను వాసనలు కాదు.
నేను వృత్తులు కాదు....
అలా నిరసించడం రావాలి.

నిరసించాలి అంటే?
కాంక్ష వుండకూడదు.
మోహం వుండకూడదు.
కోరిక అస్సలు వుండకూడదు.

శి: అవన్నీ లేకపోతే... నిరసించగలుగుతాము.
గు: నిరసించగలుగుతాం.
అప్పుడు తీవ్ర వైరాగ్యంనీలో పనిచేస్తుందన్నమాట!
కాబట్టి కోరిక... కాంక్ష... మోహం... నుంచి బయటపడాలి. అర్థమైందా?

ఇట్లా నిజజీవితంలో ఎదిగినటువంటి జీవితం జీవించావు.
వైరాగ్య భావంలో ఎదిగిపోవడం లేదా? (*విరాగ దృష్టి క్రమేపీ వృద్ధిపొందుతుందని భావము)

అసలు వాడిని పట్టగలిగేది ఏదండీ? ప్రపంచంలో....?
వైరాగ్యంఉన్నవాడి జోలికి ఎవడూ రాడండి అసలు. సమస్యేలేదు అందులో...!
వాడిని చూస్తే ప్రపంచం పారిపోతుంది.
నా జోలికి అసలు ఎవరూ రారు.
నాతో ఎవ్వరూ మాట్లాడరు.
ఎప్పుడూ ఏకాంతమే నాది.
నా ఏకాంతానికి అస్సలు భంగం వుండదు.
కారణం ఏంటి?
తీవ్రవైరాగ్య సంపన్నుడు....!

ఎవరు మాట్లాడినా ఆఁ... BP... range లో మాట్లాడుతుంది.
తీవ్రవైరాగ్యంతో మాట్లాడుతాను.
కేవల జ్ఞానంతో మాట్లాడుతాను.

ఏమైపోతాము అప్పుడు?
విషయానికి అవకాశం ఏది అక్కడ అసలు?

(విషయానికి) కొద్దిగా అవకాశం ఇచ్చావు, ఏమైంది అప్పుడు?
ఆఁ... మొత్తం ప్రపంచ మంతా తయారు చేసింది.

కాబట్టి, “మూలంలోనే దానిని ఛేదనం” చేస్తే....?
మళ్ళా పుట్టే అవకాశం లేదు.
కాబట్టి,
మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు” అని....
ఎనిమిది శరీరాలకి మూలం లేదయ్యా బాబు!

జీవుడిగా నాలుగు శరీరాలు, ఈశ్వరుడిగా నాలుగు శరీరాలు.
ఈ ఎనిమిది శరీరాలకి ఏమీ మూలము లేదయ్యా...!!
ఎఱుకచేత, ‘భ్రాంతిచేత తయారైనాయి.

ఇక చాలు, అవసరం లేదు.... నిజ జీవితంలో పాటించాలి...!!!

స్వధర్మం.... స్వధర్మపోషణ వరకూ వినియోగించుకో! ఏం ప్రమాదం లేదు.
దాటి పరధర్మంలోకి వచ్చావు...? తగాదా వచ్చేస్తుంది.                           (స్వస్తి!)

[గమనిక: ఈ బోధ అంతాకూడా “ఆత్మవిచారణ” బోధకు ముందుగా... మన సత్సంగ సభ్యురాలికి అనుగ్రహించబడినది. అనంతరం వారి సౌజన్యంతో మనకూ లభించినది. కాగా... ఆత్మవిచారణబోధలో.... “ఉన్న వస్తువు ఆత్మయని... అది నేనుఅని... వస్తునిశ్చయజ్ఞానం” ఏర్పడానికి దోహదపడగా...

అట్టి “వస్తు నిశ్చయజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి” ఈ బోధ మార్గనిర్దేశనం చేస్తున్నది కనుక ఈ దివ్యజ్ఞానమృతధారకు... ఆత్మనిష్ఠఅని పేరిడమైనది.]


ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః
ఓం తత్‌ సత్‌
ఓం శాంతిః శాంతిః శాంతిః